గత కొంతకాలంగా సహజీవనం చేస్తోన్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..... హైదరాబాద్ గన్‌ఫౌండ్రికి చెందిన బండారి దత్తు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య హేమలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

దత్తుకు దూరపు బంధువయ్యే సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌కు చెందిన భారతి భర్త 15 ఏళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆమె తన ఇద్దరు కొడుకులతో కలిసి తన సొంతింటిలో నివసిస్తూ సంగారెడ్డిలోని ఓ బట్టల షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

ఈ క్రమంలో గత కొంతకాలం నుంచి దత్తుతో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అదే గ్రామంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వీరిద్దరూ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గత నాలుగు రోజులుగా దత్తు కనిపించకపోవడంతో ఆయన భార్య పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.