అనారోగ్య కారణాలతో బుధవారం రాత్రి 7గంటలకు భిక్షపతి మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోని సక్కుబాయి శోకసంద్రంలో మునిగిపోయింది.
దాదాపు 60ఏళ్ల దాంపత్యం వారిది. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించారు. అలాంటి వారిని మరణం వేరు చేయాలని చూసింది. అనారోగ్యంతో భర్త ప్రాణాలు కోల్పోగా.. ఆయన మీద బెంగతో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుషాయిగూడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కుషాయిగూడకు చెందిన నాలచెర్ల భిక్షపతి(75), సక్కుబాయి(64) భార్యభర్తలు. ఈ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయి. స్థానిక నాగార్జున సాగర్ కాలనీ పరిధిలో లక్ష్మీ నర్సింహ కాలనీలో నివసిస్తున్న కుమారుడి వద్ద ప్రస్తుతం వారు ఉంటున్నారు.
అనారోగ్య కారణాలతో బుధవారం రాత్రి 7గంటలకు భిక్షపతి మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోని సక్కుబాయి శోకసంద్రంలో మునిగిపోయింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భర్త అంత్యక్రియలు నిర్వహిస్తుండగా... ఛాతి నొప్పితో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు.
వారు వచ్చి పరిశీలించగా.. అప్పటికే సక్కుబాయి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. దంపతులు ఇద్దరికూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిద్దరికీ ఒకేసారి దహన సంస్కారాలు నిర్వహించడం గమనార్హం.
