Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తు... కుటుంబాన్ని చిత్తు చేసింది..!

పొట్టకూటి కోసం పరాయి దేశం నుంచి ఇక్కడకు వలస వచ్చిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

Couple died an accident at Hyderabad
Author
Hyderabad, First Published Feb 23, 2021, 8:56 AM IST

ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడపడం వల్ల.. అభం, శుభం తెలియని ఇద్దరు భార్యభర్తలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పొట్టకూటి కోసం పరాయి దేశం నుంచి ఇక్కడకు వలస వచ్చిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేపాల్‌లోని డాంగ్‌ జిల్లా పప్పారి గ్రామానికి చెందిన రూమ్‌లాల్‌ బండారి (40) మీనాదేవి బండారి (35) ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరి బంధువు బలరామ్‌ సునార్‌ సైతం వీరితో కలిసే ఉంటున్నాడు. అల్వాల్‌ ప్రాంతంలోని దేవుని అల్వాల్‌ శివాలయం రోడ్డులో స్థిరపడిన ఈ ముగ్గురూ స్థానికంగా పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నారు.

గత ఏడాది లాక్‌డౌన్‌లో వీరి వ్యాపారం మూతపడగా.. కొన్ని నెలలు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇటీవలే తమ ఇద్దరు పిల్లల్ని తన తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టిన రూమ్‌లాల్‌ భార్య, బంధువుతో కలిసి తిరిగి అల్వాల్‌ వచ్చాడు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన వ్యాపారం ముగించుకున్న ముగ్గురూ నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. దేవుని అల్వాల్‌ శివాలయం రోడ్డు మూల మలుపు వద్దకు వచ్చిన వీరిని వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాస్త దూరంగా ఉన్న వీరి బంధువు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ప్రమాదం బారినడపటం, స్వదేశంలోని వీరి పిల్లలు అనాథలు కావడంతో ఇక్కడి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ టిప్పర్‌ను నిర్లక్ష్యంగా నడిపాడని, మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ప్యాసింజర్‌ ఆటోను తప్పించే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్‌ పోలీసులు ఈసీఐఎల్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ కె.నర్సింహ్మను (59) అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించగా బీఏసీ కౌంట్‌ 165గా వచ్చింది. వయోభారంతో ఉన్న ఇతడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలను ఆరా తీయాలని అధికారులు నిర్ణయించారు. నర్సింహ్మను అరెస్టు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios