తాము వద్దంటున్నా అబార్షన్ చేసుకుందని కోడలిపై, హస్పిటల్ కు తీసుకెళ్లిందని ఆమె తల్లిపై, చేసిందని మహిళా డాక్టర్ పై దంపతులు దాడి చేసారు. 

కరీంనగర్ : గర్భంతో వున్న తమ కోడలికి అబార్షన్ చేసారంటూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద అత్తింటివారు హంగామా సృష్టించారు. తాము వద్దంటున్నా అబార్షన్ చేసుకుందని కోడలిపైనే కాదు చేయించిన ఆమె తల్లిపై కూడా దాడిచేసారు. చివరకు అబార్షన్ చేసిందని అనుమానిస్తూ మహిళా డాక్టర్ పై కూడా చీపురుతో దాడిచేసారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భిణి. అయితే ఆమెకు బిడ్డను కనడం ఇష్టంలేకపోకపోవడంతో అబార్షన్ చేసుకోడానికి సిద్దమైందని... తాము వద్దని చెప్పడంతో ఎవ్వరికీ తెలియకుండానే గర్భం తీయించుకుందని అత్తామామలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కోడలికి బలవంతంగా అబార్షన్ చేసారంటూ కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ పై దాడికి దిగారు. 

Read More బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం.. హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ లోని ఓ ప్రైవేట్ క్లినిక్ వద్దకు చేరుకున్న దంపతులు కోడలిని చితకబాదారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన ఆమె తల్లితో పాటు మహిళా డాక్టర్ పై దాడికి దిగారు. కోడలిపై అత్త ఇటుక, చీపురుతో దాడిచేసింది. అలాగే తమ కోడలికి అబార్షన్ చేసిందంటూ ఓ మహిళా డాక్టర్ ను చీపురుతో కొట్టింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లినిక్ వద్దకు చేరుకుని మహిళ అత్తామామను సముదాయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై డాక్టర్ ను ప్రశ్నించగా మహిళ అనారోగ్యంతో హాస్పిటల్ కు వస్తే ట్రీట్మెంట్ చేసామని అన్నారు. ఆమెను అబార్షన్ చేసామంటూ అత్తామామల మాటల్లో నిజం లేదని... తాము చెప్పేది వినకుండా దాడికి దిగడం దారుణమని అన్నారు. 

అయితే ఈ హాస్పిటల్లో గతంలో కూడా అబార్షన్లు జరిగాయని... కేసులు కూడా నమోదయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ లో ఇలాంటి హాస్పిటల్స్ చాలా వున్నాయని... ఇది తెలిసినా వాటిపై వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని అన్నారు. ఆసుపత్రులపై నిఘా పెట్టి ముమ్మరంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.