మైలార్‌దేవుపల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ వదిలి బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనకు ఆకర్షితుడినై ఈ పని చేస్తున్నానని అన్నారాయన.  ఈ నెల 9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 

మైలార్‌దేవుపల్లి డివిజన్‌ కాటేదాన్‌లోని కార్పొరేటర్‌ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విధంగా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చేరిన తర్వాత తనకు అన్ని అవమానాలే ఎదురయ్యాయన్నారు. 

తనను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించినా పార్టీకి అనుకూలంగానే ఉన్నానని, పార్టీ అధిష్ఠానం మాట్లాడుతుందని ఆశించానని, కానీ తనకు నిరాశే ఎదురయిందన్నారు. ఈ కారణంతోనే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల అండదండలతో గెలిచిన కార్పొరేటర్‌పై ఎమ్మెల్యే మనుషులు దాడులు చేయడం బాధాకరమని తోకల శ్రీశైలంరెడ్డి అన్నారు. 

బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్‌, ప్రత్యేక ఆహ్యానితులు ఎన్‌.మల్లారెడ్డి, అధికార ప్రతినిధి జోగి రవి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ ఎం.కొమురయ్య మాట్లాడారు.