Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రి నిర్వాకం: కాన్పు కోసమని వెళ్తే కోవిడ్ అని 29 లక్షలు గుంజి శవం అప్పగింత

పరీక్షల నివేదికలు ఇవ్వాలని, వేరే వైద్యుల అభిప్రాయం తీసుకుంటామని చెప్పడంతో చివరకు గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందిందంటూ ఆసుపత్రివారు ప్రకటించారని భర్త ఆరోపించారు. 

Corporate hospital squeezes 29 lakhs and gives away dead body, husband alleges
Author
Hyderabad, First Published Sep 5, 2020, 10:00 AM IST

‘నా భార్యను ప్రసవానికని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తే.. కొవిడ్‌ అని చెప్పి.. చికిత్స పేరుతో రూ.29 లక్షలు వసూలు చేశారు. చివరకు ఆమె మృతదేహాన్ని అప్పగించారు..’’ ఓ బాధితుడి ఆవేదన ఇది. 

మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం బల్సురుగొండకు చెందిన మాధవరెడ్డి భార్య శ్వేతారెడ్డి ఇటీవలే గ్రూపు-2లో ఏసీటీవోగా ఎంపికై హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. నిండుగర్భిణి అయిన ఆమెకు జులై 27న స్వల్పంగా జ్వరం రావడంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపిస్తే మాత్రలు ఇచ్చి పంపించారు. 

అదేనెల 29న కోస్గిలోని ఓ ఆస్పత్రిలో చూపించినా జ్వరం తగ్గలేదు. ఆగస్టు 3న కాన్పు కోసం మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా దగ్గు వస్తున్నందున కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. 

Corporate hospital squeezes 29 lakhs and gives away dead body, husband alleges

స్థానిక జనరల్‌ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంటే నెగటివ్‌ వచ్చింది. అయినా స్థానిక ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతో కాన్పు కోసం ఆగస్టు 4న హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అక్కడ మొదట రూ. 2 లక్షలు కడితేనే సిజేరియన్‌ చేస్తామని చెప్పడంతో వెంటనే డబ్బులు చెల్లించారు. మగశిశువు జన్మించాడు. డెలివరీ అయిన రెండు రోజుల తరువాత  శ్వేతారెడ్డికి కొద్దిగా ఆయాసం రావడంతో కొవిడ్‌ పరీక్షలు చేయాలని నమూనాలు సేకరించారు. 

ఫలితం నివేదిక చూపించకుండానే పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. ఎలాగైనా సరే నయం చేయాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో వైద్యులు ఆగస్టు 12న ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. డబ్బులు కడితేనే సరైన ఆరోగ్యం అందుతుందంటూ తరచూ రూ. లక్షల్లో కట్టించుకున్నారు. ఇలా 20 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. వైద్యులను సంప్రదిస్తే పరిస్థితి బాగానే ఉందని చెబుతూ వచ్చారు. 

చివరకు మాధవరెడ్డి తన భార్యను చూపెట్టాలని పట్టుబట్టడంతో బుధవారం మధ్యాహ్నం పీపీఈ కిట్‌ ఇచ్చి ఐసీయూలోకి పంపించారు. అక్కడ తన భార్య కళ్లతో చూడటం తప్పిస్తే ఎవరినీ గుర్తించే స్థితిలో లేదని మాధవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

వెంటనే ఆమె పరీక్షల నివేదికలు ఇవ్వాలని, వేరే వైద్యుల అభిప్రాయం తీసుకుంటామని చెప్పడంతో చివరకు గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందిందంటూ ఆసుపత్రివారు ప్రకటించారని భర్త ఆరోపించారు. 

దాదాపు రూ.29 లక్షలు ఖర్చు చేసినా ఎందుకు చనిపోయిందో వివరాలు తెలపాలని కోరుతున్నా చెప్పడంలేదని అన్నారు. దీనిపై హైదరాబాద్‌ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశామన్నారు. రూ. 4 లక్షలు వెనక్కు ఇస్తామంటూ ఆ ఆస్పత్రి వర్గాలు రాయబారం నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios