కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎవరికి వ్యాపిస్తుందో అంతు చిక్కకుండా ప్రజలను బెంబేలెత్తిస్తోంది. తెలంగాణలో ఒకే అపార్టుమెంట్ లో నివసిస్తున్న 20 మంది కరోనా బారిన పాడడం సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళితే... ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఒక 5 అంతస్థుల భవనంలో ఏకంగా 20 మంది ఈ వైరస్ బారినపడ్డారు. అందులో ఒకతను హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించాడు కూడా. 

అపార్టుమెంటులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవారికి కరోనా సోకనప్పటికీ... పై అంతస్తుల్లో ఉండేవారికి మాత్రం ఈ వైరస్ సోకింది. ఆరాగా తీయగా, లిఫ్ట్ బటన్ వల్ల కరోన వ్యాప్తి చెందిందని అర్థం అయింది. తొలుత ఎవరికి సోకిందో తెలీదు కానీ... రెండు వారాల గ్యాప్ లో 20 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అందులో ఒకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు కూడా. 

పై అంతస్తుల్లో ఉన్నవారు లిఫ్ట్ ను ఉపయోగిస్తుండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఇప్పుడు అపార్టుమెంటులో ఈ వైరస్ బారినపడ్డవారు హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. 

దీనితో అపార్టుమెంటులో మిగిలిన వారు తలుపులు బిగించి ఇండ్లకే పరిమితమయ్యారు. ఉన్న వాచ్ మ్యాన్ కుటుంబం కూడా ఖాళీ చేసి వెళ్లిపోయింది. దీనితో నిత్యావసరాల కోసం కూడా అపార్టుమెంటుల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇకపోతే... తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 54 వేల మంది పనిచేస్తున్నారు. ప్రధానంగా హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులకు ఎక్కువగా కరోనా బారినపడ్డారు. 

హైద్రాబాద్ కమిషనరేట్ లో 1967 మంది పోలీసులకు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలోని 5684 మందికి కరోనా సోకింది. వీరిలో 2284 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇంకా 3357 మంది కరోనా కోసం చికిత్స పొందుతున్నారు. 

కరోనా సోకిన వారిలో 44 మంది పోలీసులు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బందిలో 10 శాతం మందికి కరోనా సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈ కమిషనరేట్ పరిధిలోని 1967 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది.

వీరిలో 891 మంది ఇంకా కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరో 1053 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా సోకి 23 మంది మరణించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 526 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి కూడ 361 మంది ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. 163 మంది కరోనాను జయించారు. కరోనాతో ఇప్పటికే ఇద్దరు వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరణించారు.