తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతకాలం 80 నుంచి 90 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో 69 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని, 31 శాతం మందికి మాత్రం లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది.

ఇప్పటి వరకు 1,23,090 మందికి కరోనా సోకాగా.. అందులో 69 శాతం మందికి అంటే 84,932 మందికి లక్షణాలు లేవని పేర్కొంది. మిగిలిన 31 శాతం మందికి లక్షణాలు ఉన్నాయని నిర్థారించింది. గత 24 గంటల్లో తెలంగాణలో 2924 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల్కషా 23 వేల 090కి చేరుకుంది. 

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా పది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 818కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 1638 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు.

ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 90988కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 31284 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాదులో ఎప్పటిలాగే గత 24 గంటల్లో 400కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో గత 24 గంటల్లో 181 కేసులు నమోదయ్యాయి.