తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మొన్నటి దాకా రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక్క కేసు కనపడింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. బుధవారం రాత్రి ఒకేసారి ఏడు కరోనా  కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.  

 బుధవారం సాయంత్రం వరకు  కోవిడ్‌ -19 కేసులు ఆరు నమోదయ్యాయి. అయితే రాత్రి 10 గంటల సమయంలో కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా మరో ఏడు కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది.  దీంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఈ వార్తలు వింటుంటే.. బటయకు అడుగుపెట్టాలన్నా కూడా వణికిపోతున్నారు.

Also Read తెలంగాణలో మరో కరోనా కేసు: ఆరుగురికి పాజిటివ్ లక్షణాలు...

కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియా నుంచి కరీంనగర్ కి వచ్చారు.  మొత్తం 10మంది ఇండోనేషియా నుంచి రాగా.. వారిలో ఏడుగురికి కరోనా లక్షణాలు గుర్తించారు.దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం  గాంధీకి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. 

దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఉదయమే యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో బుధవారం ఒక్కరోజే తెలంగాణలో 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా.. రాష్ట్రంలో ఒకేసారి కరోనా కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా ని కట్టడి చేసేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా... ఈ నేపథ్యంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ సోకుతున్నందువల్ల వారికి సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించాలనీ ఆదేశించారు.  ప్రజలు స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జనం గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలు రద్దు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని కోరారు.