Asianet News TeluguAsianet News Telugu

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా మృత్యు ఘోష

నగరంలో మరో ఇద్దరు మృతి చెందడంతో గ్రేటర్‌లో కరోనా మృతుల సంఖ్య 27కు చేరింది. వీరిలో ఒకరు జియాగూడ వెంకటేష్‌నగర్‌కు చెందిన మహిళ కాగా..మరొకరు బన్సీలాల్‌పేటలోని జయానగర్‌కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు ఉండటం గమనార్హం. 

coronavirus cases raises in Hyderabad
Author
Hyderabad, First Published May 5, 2020, 1:56 PM IST

తెలంగాణ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. లాక్ డౌన్ పొడిగిస్తున్నప్పటికీ.. రోజు రోజుకీ కొత్త కేసులు పుట్టుకువస్తూనే ఉన్నాయి. ఈ ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే ఉంది.

సోమవారం నగరంలో మరో ఇద్దరు మృతి చెందడంతో గ్రేటర్‌లో కరోనా మృతుల సంఖ్య 27కు చేరింది. వీరిలో ఒకరు జియాగూడ వెంకటేష్‌నగర్‌కు చెందిన మహిళ కాగా..మరొకరు బన్సీలాల్‌పేటలోని జయానగర్‌కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు ఉండటం గమనార్హం. ఇక వనస్థలిపురం, జింకలబావికాలనీ, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

ఐడిహెచ్‌ కాలనీ సమీపంలోని జయనగర్‌ కాలనీ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు(62) సోమవారం మృతి చెందారు.గాల్‌ బ్లాడర్‌ సమస్యతో బాధపడుతున్న బాధితురాలిని ఏప్రిల్‌  21న కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఆ తర్వాత సదరు మహిళకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిందని గాంధీనగర్‌ పోలీసులు తెలిపారు.

జియాగూడ వెంకటేష్‌ నగర్‌లో నివసిస్తున్న వృద్ధురాలు(72) గత వారం కరోనా సోకి మృతి చెందగా, తాజాగా సోమవారం ఆమె కోడలు (55) కరోనా పాజిటివ్‌తో మృతి చెందినట్లు కుల్సుంపురా ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మిగిలిన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి పంపి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ ఎస్‌కేడీ నగర్‌లో సోమవారం  ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు  తెలిపారు. ఇప్పటికే ఆయన భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో కరోనాతో మృతిచెందిన ఆలంపల్లి ఈశ్వరయ్య, మధుసూదన్‌లకు వీరు దగ్గరి బంధువులు కావడం గమనార్హం. సోమవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, అధికారులతో కలసి ఆయా ప్రాంతాలలో పర్యటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios