నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో గంటల వ్యవధిలోనే  తల్లీ కొడుకులు కరోనాతో మరణించారు. ఈ ఘటన  ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.కామారెడ్డి జిల్లా బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీనా భర్త మల్లెల హన్మంత్ వయస్సు 41 ఏళ్లు.  ఆయన తల్లి గంగమణి వయస్సు 70 ఏళ్లు.  వారం రోజులుగా  వీరిద్దరూ జ్వరంతో బాధపడుతున్నారు. 

దీంతో హన్మంతు బోధన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నాడు. నాలుగు రోజుల తర్వాత ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు.  దీంతో కుటుంబసభ్యులు  ఆయనను నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సమయంలో ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా సోకినట్టుగా తేలింది.  

హన్మంత్ కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు.  హన్మంత్  తల్లి గంగమణికి కూడ కరోనా వచ్చినట్టుగా తేలింది. దీంతో గంగమణి కూడ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగమణి  ఆదివారం నాడు సాయంత్రం మరణించింది.  సోమవారం నాడు  ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హన్మంత్ కూడా మరణించారు.  గంటల వ్యవధిలోనే కరోనా కారణంగానే తల్లీకొడుకులు మరణించడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈ ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు.