Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణపై మళ్లీ పంజా విసిరిన కరోనా... ఒక్కరోజే 31 పాజిటివ్ కేసులు

తెలంగాణపై  కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. 

corona positive cases increase in AP
Author
Hyderabad, First Published May 9, 2020, 9:38 PM IST

హైదరాబాద్: తెలంగాణపై మరోసారి కరోనా పంజా విసిరింది. గత కొద్దిరోజులుగా చాలా తక్కువ కేసులు నమోదవుతుంటే ఈ మహమ్మారి బారినుండి తెలంగాణ మెల్లిగా బయటపడుతుందని అందరూ భావించారు. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రం కరోనా నుండి బయటపడలేదు. ఇవాళ(శనివారం) ఒక్కరోజే తెలంగాణలో 31పాజిటివ్ కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ గణాంకాలు మరోసారి తెలంగాణలో కలకలాన్ని సృష్టించింది. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇవాళ 30 కేసులు నమోదయ్యాయి. అలాగే  వలస కూలీ ఒకరికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  1163గా నమోదయ్యాయి. అయితే ఇప్పటికే  751 మంది డిశ్చార్జి అవ్వడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 382గా వుంది. ఇవాళ ఒక్కరోజే మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో 30 కరోనా మరణాలు నమోదయ్యాయి. 

కరోనా వైరస్ పరీక్షలు తెలంగాణలో ఎక్కువగా నిర్వహించడంలేదని తెరాస ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము సరిపోను టెస్టులు నిర్వహిస్తున్నామని, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే టెస్టులు నిర్వహిస్తున్నామని చెబుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే... తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరోనా వైరస్ టెస్టుల గురించి మాట్లాడుతూ.... కేసులు తక్కువగా నమోదవడానికి టెస్టులు చేయకపోవడానికి సంబంధంలేదని, కేసులు బయటపడకపోవడానికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి లేకపోవడం అని కొత్త సిద్ధాంతాన్నే చెప్పారు. 

కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్, తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ తో నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.... తెలంగాణాలో టెస్టింగ్ తక్కువగా చేస్తున్నట్టున్నారని అన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే ఇలా తెలంగాణాలో టెస్టులు తక్కువగా నిర్వహిస్తున్నారని అనడంతో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. అన్ని పార్టీలు కూడా తాము ముందు నుండి కూడా ఇదే విషయం చెబుతున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంటున్నారు. 

ఇకపోతే.... నిన్న తెలంగాణ హైకోర్టు కూడా కేసీఆర్ సర్కారును ఈ టెస్టింగులపై మందలించింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హై కోర్ట్ సీరియస్ అయ్యింది. మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయట్లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 

మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించినప్పుడు మాత్రమే అతడు ఎలా చనిపోయాడో తెలుస్తుందని, ఒకవేళ అతడు కరోనా వైరస్ వల్ల గనుక చనిపోయి ఉంటే.... అప్పుడు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. అలా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించకపోతే సదరు వ్యక్తి ఎలా చనిపోయాడా తెలియక చాలా పెద్ద ప్రమాదానికి ఇది దారి తీసే ఆస్కారం ఉందని కోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. 

పత్రికల్లో వచ్చినవార్తా  కథనాల ప్రకారంగా  ప్రాథమిక లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అర్థమవుతుందని, ఇది సరైన పద్ధతి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా లక్షణాలుంటేనే పరీక్షలు చేసే విధానానికి ఏమైనా శాస్త్రీయత ఉందా? ఉంటే... ఆ శాస్త్రీయత ఏమిటో వివరించాలని కోర్టు తెలిపింది.  కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావాలంటే... లక్షణాలున్న వారికి, వారి సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా అందరికీ పరీక్షలు నిర్వహించినప్పుడు మాత్రమే వీలవుతుందని, వీరితోపాటుగా మరణించిన వారికి కూడా ఈ కరోనా పరీక్షలు చేయాలని కోర్టు సూచించింది. 

కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

ఇలా గనుక పరీక్షలు నిర్వహించకపోతే కరోనా వ్యాప్తి లెక్కలు తేలవని, పైగా అంకెల గారడీతో జనాన్ని కరోనా వైరస్ విషయంలో మభ్యపెట్టడమే అవుతుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం వాస్తవిక పరిస్థితుల కోణంలో ఆలోచించాలని, మనల్ని మనమే మోసం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది.

Follow Us:
Download App:
  • android
  • ios