కరీంనగర్ లో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 26 కరోనా కేసులు నమోదయ్యాయి. రామగుండం ఎన్టీపీసీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ కు, గోదావరి ఖని బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి, అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

గోదావరి ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు షాక్ అయ్యారు. వాసన కోల్పోవడంతో బ్లడ్ బ్లాంక్ ఉద్యోగికి అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. 

ఇతను గత నెల 18న కరోనా వ్యాక్సిన్ వేయించుకోగా, రెండో డోస్ ఈ నెల 18న వేసుకున్నాడు. మరోవైపు బ్యాంకు మేనేజర్ కు కరోనా సోకడంతో సంబంధిత అధికారులు బ్యాంకును మూసేశారు. 

అలాగే బ్యాంకులో ఉన్న ఉద్యోగికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యాంకులో కరోనా కలకలం రేపడంతో అటు సిబ్బందిలో భయం మొదలయ్యింది. ఇటు బ్యాంకుకు వచ్చే వినియోగదారులు కూడా ఆందోళనలో పడ్డారు. 

బ్యాంకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారికి కూడా కరోనా భయం పట్టుకుంది. అయితే కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 

తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇష్టానుసారంగా బయట తిరగొద్దని చెబుతున్నారు.