కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌ సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌లో మృతి చెందాడు. 

అయితే మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించకుండా 6 గంటలపాటు వార్డులోనే ఉంచేశారు. దీంతో మిగతా కరోనా రోగులు, మృతుడి బంధువులు నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. 

కరోనా మృతదేహాన్ని అలా ఎందుకు వదిలేశారని సిబ్బందిని ప్రశ్నిస్తే అంబులెన్స్‌లు లేవని.. వచ్చే వరకు వేచిచూడాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. 

కరోనా రోజురోజుకూ ఎక్కువగా పెరుగుతుండడంతో ఆస్పత్రిలో  కరోనా పేషెంట్లతో నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతదేహాలను ఇలా గంటల తరబడి వార్డులోనే ఉంచడంతో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళనకు గురయ్యారు.