రికార్డింగ్ బాక్సులు ఎత్తుకెళ్లిన ఖాకీలు
లక్ష ఉద్యోగాల హామీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, ఉద్యోగ ప్రకటనల డిమాండ్ కోసం టీ జేఏసీ నిరుద్యోగ నిరసన ర్యాలీకి పిలునిచ్చిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 22 న ఇందిరాపార్కు నుంచి సుందరయ్య భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు టీ జేఏసీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. కోర్టు కూడా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు.
అయినా ఈ ర్యాలీ లో పాల్గొంటామని టీ జేఏసీ ప్రకటించింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యగా టీ జేఏసీ నేతలందరిని నిర్భంధించారు.
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం నివాసం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 22న రాత్రి మూడు గంటల సమయంలో తర్నాకలోని ఆయన నివాసంలోకి బలవంతంగా వెళ్లిన పోలీసులు ఇంటి తలుపు బద్దలు కొట్టి ఆయనను అక్రమంగా అరెస్టు చేశారు. గుర్తు తెలియని ప్రదేశంలో నిర్భంధించారు.
అయితే కోదండరాం ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన పోలీసులు ఆ రోజు ఆయనను అరెస్టు చేయడమే కాకుండా ఫర్నీచర్ ను కూడా కొంత ధ్వంసం చేశారు.
ఆయన ఇంటి ముందు సీసీ టీవీ కెమెరా లు ఉంటాయి. దానికి సంబంధించిన ఫుటేజ్ రికార్డు ఇంట్లో ఉంటుంది. వాటిని కూడా కోదండరాం కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులు దొంగిలించారు.
దీనిపై టీజేసీ నేతలు పోలీసులను నిలదీస్తే ఆ రికార్డు బాక్సులు తమ వద్ద లేవని చెబుతున్నారు.అంతేకాదు జరిగిన విషయం బయటకు తెలియకుండా పాత బాక్సులకు బదలుగా కొత్త బాక్సులు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు.
అయితే దీనిపై జేఏసీ నేతలు మండి పడుతున్నారు. దీన్ని పోలీసుల దొంగతనం అని ఎందుకు అనకూడదని ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ కి సంబంధించిన వీడియోను దాయటానికి పోలీసులు ఈ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
దొంగతనం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ, పోలీసులే దొంగతనం చేస్తే ఏం చేయాలని అని అడుగుతున్నారు.
