తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. కాగా, ఉత్తర తెలంగాణలో మాత్రం పలుచోట్ల వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. 

హైదరాబాద్: మండే ఎండలతో ప్రజలు బెదిరిపోతున్నారు. మాడు పగిలే ఎండలతో ఇంటి బయట కాలు పెట్టడానికి వణికిపోతున్నారు. అక్కడక్కడ వడగాలులూ వీస్తున్నాయి. ఈ మండే ఎండల నుంచి తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే ప్రకటన ఒకటి చేసింది. పలు ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని చెబుతూనే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉత్తర తెలంగాణలో నాలుగు రోజులపాటు వడగాలలు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాలని సూచనలు చేసింది. ముఖ్యంగా పిల్లలు, వయోధికులు మధ్యాహ్నం పూట ఇంటి బయట అడుగుపెట్టడం మంచిది కాదని తెలిపింది.

ఈ హాట్ న్యూస్‌తోపాటు ఓ కూల్ న్యూస్ కూడా చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాట మీదుగా సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగనుందని వివరించారు. ఈ కారణంగానే రాష్ట్ర ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉన్నదని తెలిపారు.

తెలంగాణలో బుధవారం అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని జైసద్‌లో 45.7, జగిత్యాలలోని ఐలాపూర్‌ 45.1 డిగ్రీల సెల్సియన్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలో కూడా ఎండ తీవ్రత అధికంగానే ఉంది. ఇక, గురు, శుక్ర వారాల్లో తెలంగాలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్పారు. 

మరోవైపు ఏపీలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లా రెంటచింతల నిప్పుల కుంపటిని తలపిస్తుంది. ఇక్కడ బుధవారం 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యధికంగా కర్నూలులో 43.4 డిగ్రీలు, అనంతపురంలో 43.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి, అమరావతి, నందిగామ, కడప, మార్కాపురం, పాతపట్నంలలో.. 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు గురు, శుక్ర వారాల్లో రాయలసీమ, కోస్తాల్లోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

ఇదిలా ఉండగా, రానున్న కనీసం ఐదు రోజులు భారత్‌లోని అధిక భాగంలో భయంకర వడగాలులు వీస్తాయని ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. ముఖ్యం వాయవ్య భారతంలో వచ్చే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల సెల్సియస్‌లు పెరుగుతాయని తెలిపింది. ఆ తర్వాత ఆ పెరిగిన రెండు డిగ్రీల సెల్సియస్‌లు పడిపోవచ్చని వివరించింది. ముఖ్యంగా రాజస్తాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలకు ఐఎండీ వడగాలులపై వార్నింగ్ ఇచ్చింది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఇప్పటికే 45 డిగ్రీల సెల్సియస్‌లకు మించి టెంపరేచర్‌లు నమోదు చేస్తున్నాయని వివరించింది. ఈ కఠిన పరిస్థితులు మే తొలివారం వరకూ ఉండొచ్చని ఐఎండీ సైంటిస్టు ఆర్కే జెనామని తెలిపారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌లు దాటుతున్నాయి.