హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్0 మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడిని ఆయన బెదిరించినట్లుగా ఆ ఆడియో రికార్డింగ్ ను బట్టి తెలుస్తోంది. 

స్థానిక సమస్యలను బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టాడు. దానిపై రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడిని రసమయి బాలకిషన్ అసభ్య పదజాలంతో దూషించారు. మరోసారి సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానంటూ బెదిరించారని ఆయన ఆడియో ద్వారా తెలుస్తోంది. 

గతంలో రసమయి బాలకిషన్ కు చేదు అనుభవం ఎదురైంది. రెండేళ్ల క్రితం ఆయన ప్రజల నుంచి నిరసన ఎదుర్కున్నారు. 2014లో ఆయన మానకొండూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి ఆయన పోటీ చేసే సమయంలో  వ్యతిరేకత ఎదుర్కున్నారు. అయితే, ఎన్నికల్లో ఆయన తిరిగి గెలిచారు. 

సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావని రసమయి బాలకిషన్ అడిగారు. ఎందుకు పెట్టకూడదని ఆ యువకుడు ఎదురు ప్రశ్న వేశారు.