ఎవరి ఇంట్లో అయినా.. చోరీ జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తాం. కానీ ఇక్కడ ఏకంగా పోలీసు ఇంట్లోనే చోరీ జరిగింది.  ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగలు పడి రూ. 10లక్షల విలువచేసే బంగారం,డబ్బు చోరీ చేశారు. ఈ ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

పోలీసుల కథనం మేరకు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మేకుల మనోహర్ రెడ్డి అల్మాస్‌గుడ ఎంఆర్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో భోజనాలు అనంతరం నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తరువాత దొంగలు వంట గది నుంచి ఇంటిలోకి ప్రవేశించి, రూ.7 లక్షల నగదు, 6.5 తులాల బంగారు ఆభరణాలు తస్కరించారు. ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.