మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కోణంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై గతంలో చేసిన ఎన్నికల అఫిడవిట్ ఫిర్యాదు చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. 

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్ర జరిగిందన్న వార్తలతో తెలుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు. నలుగురు వ్యక్తులు ఆయనను చంపేందుకు సుపారీ ఇచ్చి మరి చంపించేందుకు ప్రయత్నించారు. ఈ కుట్రను భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు.. (cyberabad police commissioner) నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు ఫారుఖ్ అనే వ్యక్తితో మంత్రిని హత్య చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 12 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫారుఖ్ పోలీసులకు సమాచారం అందించడంతో హత్య కుట్ర బయటపడింది. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కోణం చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లింకుతో ఈ కేసుకు లింకు వున్నట్లు సమాచారం. గత సమయంలో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్‌లో అక్రమాలు వున్నాయంటూ మహబూబ్ నగర్‌కు చెందిన కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు చేసిన వారిని కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం 12 కోట్లు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారని చెబుతున్నారు. 

ఇకపోతే.. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్‌పై (election affidavit) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి ఇటీవల స్పందించారు. తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆమోదించిన తుది అఫిడవిట్‌నే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. నామినేషన్లు వేశాక అఫిడవిట్ మార్చడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల టైమ్ నుంచే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు. Delhi High Coutలో 2021 డిసెంబర్‌లో కేసు డిస్మిస్ అయిందని అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆరా తీస్తామన్నారు. ఇతరులు వేసిన పిటిషన్ లు తెలంగాణ హైకోర్టు లో విచారణలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయం గమనించకుండా తనపై బురద జల్లుతున్నారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొలేని వారే ఈ ఆరోపణలు చేస్తున్నారని.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతామని చెప్పారు. ఆధారాలతో సహా పేర్లు వెల్లడించి భరతం పడతానని హెచ్చరించారు.

తమకున్న ఆదరణ చూసి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు మీడియా చానల్స్ పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు. పిటిషన్‌లో ఉన్న అంశాలను ప్రచురించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోర్టులో కేసు నడుస్తోందని అవాస్తవాలు రాశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్రలు చేశారని అన్నారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించారని చెప్పుకొచ్చారు. కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల నేతలంటే పెద్ద కులానికి చెందిన ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని ఆరోపించారు.