సిరిసిల్ల: మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఓడిపోవాలని హరీష్ కోరుకుంటున్నట్లు తెలిపారు. 

కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతే టీఆర్ఎస్ పగ్గాలు తన చేతుల్లోకి వస్తాయని హరీష్ ఆశపడుతున్నాడని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్ కు, కేటీఆర్ ఓడిపోతే అమెరికాకు వెళ్లిపోవాలని హరీష్ రావు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను ఓడించాలని హరీష్ రావు కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డితో చర్చలు జరిపారన్నారు. 

మరోవైపు తాము చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరి బతుకమ్మ చీరలు సిరిసిల్లలో కొనుగోలు చెయ్యకుండా సూరత్ లో ఎందుకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిస్థితిని చూసి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తన కన్నీళ్లను కళ్లలోనే దాచుకున్నారని చెప్పారు. 

నేరెళ్లలో ఇసుక మాఫియాకు ఎదురు తిరిగిన ఎస్సీలను చిత్ర హింసలకు గురిచేశారని రేవంత్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పంటలకు గిట్టుబాటు ధరలు అడిగిన రైతులకు బేడీలు వేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కుటుంబంలో వ్యక్తులకే ప్రయోజనం కల్గింది తప్ప ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. 

సిరిసిల్లలో పేదరికాన్ని, నేతన్నల ఆత్మహత్యలను ఆపలేదన్నారు. కార్మికుల పేదరికాన్ని కూడా కమీషన్లకు ఉపయోగించుకొనే వ్యక్తి కేటీఆర్‌ అని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత కూడా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని కనీసం పరామర్శించలేదని ఘాటుగా విమర్శించారు. 

కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది మృతి చెందితే కనీసం ఆ కటుంబాలను పరామర్శించలేదని రేవంత్ దుయ్యబుట్టారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మాటలు నమ్మితే మోసపోతామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తెలంగాణ మారలేదని తెలిపారు. ప్రజాకూటమికి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో నిరూపిస్తామని స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

హరీష్, కేటీఆర్‌లకు మరోసారి రేవంత్ సవాల్: ఈ సారి స్థలం కూడా...