వచ్చే ఎన్నికల్లో 74 సీట్లలో కాంగ్రెస్ విజయం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమాను వ్యక్తం చేశారు.
ఖమ్మం:వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 70 నుండి 74 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమాను వ్యక్తం చేశారు.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చారు. హైద్రాబాద్ నుండి ఖమ్మం జిల్లాకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం నాడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలవబోతుందన్నారు.
ఖమ్మంలో 10 స్థానాలు గెలుచుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అందించే గ్యారెంటీ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని భట్టి విక్రమార్క కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఆషామాషీగా గ్యారెంటీ హామీలు ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ లో చేరాలని తాను భావించిన సమయంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ నాయకత్వం తనను ఆహ్వానించడం పట్ల తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. 40 ఏళ్లుగా నిబద్దతో రాజకీయాల్లో పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తాను పనిచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్ర సంపదను దోచుకోవడమే, దాచుకోవడం బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేస్తుందన్నారు.గ్రూప్-1 రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టులాంటిదన్నారు.డబ్బుల కోసం టీఎస్‌పీఎస్‌సీ పేపర్లను బఠానీల్లా విక్రయించారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.