హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కాంగ్రెస్ తేరుకోలేకపోతుంది. ప్రజాకూటమివైపు గాలి వీస్తుందని అంతా అనుకుంటే ఫలితాల్లో సీన్ సితార కావడంపై ఆత్మ పరిశీలనలో పడింది. అంతా బాగుందన్న పరిస్థితుల్లో ఎక్కడ దెబ్బతిన్నాం? అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. 

ఎన్నికల్లో ఓటమి భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఓటమిపై విశ్లేషించారట నేతలు. ఎందుకు ఓడిపోయాం అనే అంశంపై పోస్టుమార్టం చేశారట. టీడీపీతో జతకట్టడం కాంగరెస్ పార్టీ కొంప ముంచిందా అన్న అంశంపైనా చర్చించారట టీ కాంగ్రెస్ నేతలు. 

ఒకవేళ ఆ నిర్ణయమే తప్పు అయితే మనల్ని మనమే ఓడించుకున్నాం అంటూ గుసగుసలాడకుంటున్నారట. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చెయ్యడం ఆ తర్వాత 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, వెనువెంటనే ప్రచార రంగంలో దిగిపోయింది. 

ఒక విడత టీఆర్ఎస్ పార్టీ ప్రచారం పూర్తైన కాంగ్రెస్ లో సీట్ల లొల్లి ఓ కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు సీట్లు సర్ధుబాటు చేసే సరికి అలకలు, బుజ్జగింపులు అన్నీ జరిగాయి. ఇవన్నీ సెట్ చేసుకునే సరికి టీఆర్ఎస్ రెండో దశ ఎన్నికల ప్రచారం చేసేస్తోంది. 

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను, సినీ, క్రికెట్ రంగాల్లో ప్రముఖులను ఎన్నికల ప్రచారంలోకి దింపింది. ఎన్నికల ప్రచార బరిలో దిగిన కాంగ్రెస్ తెలంగాణలోని నలుదిక్కులా ప్రచారంతో హోరెత్తించింది. 

ప్రజాకూటమి టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తుంది అనే ప్రచారం దగ్గర నుంచి ప్రజాకూటమిదే అధికారం అనేంతవరకు జోరుగా ప్రచారం కూడా జరిగింది. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం బొక్క బోర్లాపడ్డారు. కనీసం అయిదో వంతు కూడా సీట్లను సాధించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. 

తెలంగాణ ఎన్నికల్లో ఏ అంశాల వారీగా ప్రజాకూటమి ఓటమిపై విశ్లేషించుకున్నా కూటమిది మాత్రం మహాకూటమిగా చెప్పుకోవచ్చు. ప్రాంతాలు వారీగా గమ నించినా, జిల్లాల వారీగా విశ్లేషించుకున్నా, సామాజిక వర్గాలుగా లెక్కేసుకున్నా ఇది మాత్రం ఘోర పరాభవంగానే చెప్పుకోవాలి. 

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ జోరుకు ప్రజా కూటమి కకావికలమైంది. అయితే ఇంతటి ఘోర పరాజయానికి కారణం టీడీపీతో పొత్తేనని కొంతమంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీతో పొత్తు, చంద్రబాబు పాత్ర తమను నిట్టనిలువునా ముంచేసిందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి ఆరోపిస్తున్నారు. 

అందుకు ఎన్నికల ఫలితాల సరళిని కూడా ఆధారంగా చూపిస్తున్నారు. టీడీపీకి తెలంగాణలో ఇంకా బలముందని, ఆంధ్ర ఓటర్లు ఆదరిస్తారను కున్నారు. కానీ సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో కూటమికి పెద్ద దెబ్బ తగిలింది. రంగారెడ్డి నియోజకవర్గాల్ని కలుపుకొని ఉండే హైదరాబాద్‌ మహానగరంలో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం.

చంద్రబాబు పదే పదే తాను  నిర్మించానని చెప్పుకునే సైబరాబాద్‌ లోని సైబర్‌ టవర్స్‌ ఉన్న శేరిలింగంపల్లితో సహా బాబు రోడ్‌షోలు, సభలు పెట్టిన చోటల్లా కూటమికి ఓటమి తప్పలేదు. ఖమ్మం పట్టణం నుంచి కుత్బుల్లాపూర్‌ వరకు ఆయన సాగించిన ప్రచార ప్రస్థానంలో అన్నిచోట్ల ప్రజాకూటమి ఓటమిపాలైంది. 

చంద్రబాబుతో పొత్తువల్ల కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందని కొందరు ముందునుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ బహిరంగంగా చెప్పలేకపోయారు. ఆర్థికవనరులు సమకూర్చే కారణం చూపి, రాహుల్‌గాంధీని చంద్రబాబు బుట్టలో పడేశారని రాహుల్ ఆదేశాలతో తాము ఊ అనాల్సి వచ్చిందని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర నుంచి కింది స్థాయి వరకు పొత్తుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని అయితే బయటకు చెప్పలేక ఓటు రూపంలో గుద్దిపడేశారని కొందరు అభిప్రాయపడ్డారు. టీడీపీతో జట్టు కట్టడం వల్ల లాభపడకపోగా నష్టపోతామనే అభిప్రాయం ఉంది. 

అయినప్పటికీ తాము ఏయీ చెయ్యలేకపోయామని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఫలితం అనుభవిస్తున్నామనే బాధ ఎక్కువ మంది కాంగ్రెస్‌ నేతలు వ్యక్తమవుతోంది. అంతేకాదు సీఎం స్థాయి ముఖ్య నేతలు కూడా ఓడిపోవడం పార్టీ శ్రేణులనూ నిరాశకు గురి చేసింది. 

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వచ్చిన సానుకూలత కూటమి ఏర్పాటుతో పోయిందని మరికొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బాబు పెత్తనమా? ఇక రాష్ట్రం ముందుకెళ్లనట్లే అంటూ టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారం తెలంగాణలోని సగటు పౌరుడ్ని ఆలోచింపచేసింది. 

బలమైన కారణాలు లేకుండా అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం, ఒకే విడతలో 105 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేయడం తమకు అనుకూలిస్తోందని కాంగ్రెస్‌ ఉత్సా హంతో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి, అసెంబ్లీని రద్దు చెయ్యడం, టీఆర్ఎస్ పై అసంతృప్తి తమకు కలిసి వస్తుందని భావించింది కాంగ్రెస్. 

అయితే టీడీపీతో జట్టు కట్టడం తెలంగాణ సమాజం జీర్ణించు కోలేకపోయిందని కొందరు కాంగ్రెస్ వాదులు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే ప్రజాకూటమిని ప్రజలు అంగీకరించలేదని ఫలితంగా కాంగ్రెస్ కు ఉన్న సానుకూలత సైతం టీఆర్ఎస్ కు వెళ్లిపోయిందని చెప్తున్నారు. 

ఇకపోతే టీడీపీతో పొత్తుపెట్టుకుని బలమైన ప్రచార అస్త్రాన్ని గులాబీ దళపతి కేసీఆర్ కు అందజేశారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ పార్టీ ప్రచారం పరిశీలిస్తే కాంగ్రెస్ ను తిట్టిన దానికంటే చంద్రబాబును తిట్టడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. కేసీఆర్ కు ఒక గొప్ప అవకాశంలా చంద్రబాబు దొరికారు.  

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలలో కేసీఆర్ తన ప్రసంగాల్లో సంక్షేమ, అభివృద్ది అంశాలతోపాటు చంద్రబాబుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. బాబు ఎక్కడ కాలు పెట్టినా అంతే సంగతులు, కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? మీరే తేల్చుకొండంటూ కేసిఆర్‌ వేసిన ప్రశ్నలు జనంలో ఆలోచనల్ని రేకెత్తించాయని ప్రచారం.

హైదరాబాద్‌ను తానే ప్రపంచ పటంలో తానే పెట్టానని, సైబరాబాద్ తానే నిర్మించానని చివరకు దివంగత సీఎం వైఎస్సార్‌ ఆలోచన అయిన ఔటర్‌ రింగు రోడ్డు అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే వంటివీ తానే తెచ్చానని చంద్రబాబు రాహుల్‌ గాంధీ సమక్షంలోనే చెప్పుకోవడం పలువురి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు.  

వైఎస్ అభిమానులు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు రాహుల్ సమక్షంలో ఇంతలా అసత్యాలు ప్రచారం చేస్తుండటం దానిని ఒక్క కాంగ్రెస్ నేత కూడా అడ్డు చెప్పకపోవడం పార్టీకి పెద్ద మైనస్ అయ్యిందనే చెప్పాలి. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తెచ్చుకుని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు, తెలంగాణలో వచ్చి పార్టీ మారిన వారిని ఓడించాలంటూ పిలుపునివ్వడం ప్రజలను విస్మయానికి గురి చేసింది. 

ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఔనా అనే దగ్గర నుంచి నిజమే అనిపించేంత వరకు కేసీఆర్ అండ్ టీం చంద్రబాబును పట్టినపట్టు వదలకుండా తూర్పారపట్టారు. 

ప్రజల మైండ్ సెట్ మార్చేశారు. మాటల మాంత్రికుడిగా పేర్గాంచిన కేసీఆర్ తన వాక్చాతుర్యంతో చంద్రబాబుపై పంచ్ లేస్తూ బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమంటూ ప్రజలు నమ్మించేలా కాదు నమ్మేలా చేసేశారు. 

తెలంగాణలో ప్రజాకూటమి ఎన్నికల ప్రచారంతో సహా ఎన్నికల ఖర్చంతా టీడీపీయే భరిస్తుందని, ప్రచారానికి హెలికాప్టర్లను కూడా చంద్రబాబు నాయుడే సమకూర్చారని కాంగ్రెస్‌లో కొందరు అభ్యర్థుల్నీ బాబే ఖరారు చేసినట్లు వచ్చిన ప్రచారం ప్రజాకూటమి పాలిట శాపంగా మారాయి. 

ఆఖరికి సర్వేల పేరుతో లగడపాటి రాజగోపాల్ చేసిన హంగామా వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇలా లగడపాటి తన సర్వే పేరుతో కాంగ్రెస్‌ వర్గీయుల్లో లేని భ్రమల్ని కల్పించారు. ఉన్నవి లేనివి కల్పించి టీఆర్ఎస్ కార్యకర్తల్లో మరింత పట్టుదల వచ్చేందుకు కారణమయ్యారు. 

కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు ఉంటే కాంగ్రెస్ ఓటమికి మాత్రం ఒకే ఒక్క కారణం చంద్రబాబు నాయుడు అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు బలంగా ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి పొత్తుకు ముందే చెప్పారు. 

తన మాట వినలేదంటూ ఫలితాల తర్వాత కూడా చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. తెరమీదకు విజయశాంతి మాత్రమే వచ్చారని ఇంకా ఎందరో లోలోన మాత్రం ఆగ్రహంతో రగలిపోతున్నారని తెలుస్తోంది.