Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022: గాంధీ భవన్ లో నేడు కాంగ్రెస్ కీలక భేటీ, హజరు కానున్న మాణికం ఠాగూర్

మునుగోడు నియోజకవర్గంలో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నాడు చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సహ పార్టీ నేతలు ఈసమావేశంలో పాల్గొంటారు. 

Congress To Conduct Meeting  today On munugode bypoll
Author
First Published Oct 4, 2022, 9:32 AM IST

హైదరాబాద్: నవంబర్ 3న మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం నాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కూడా హజరుకానున్నారు. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈస్థానం నుండి పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.  ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గానికి చెందిన  మండల ఇంచార్జులతో పాటు సీనియర్లు ఇవాళ గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. 

నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్  పార్టీ  ఇప్పటికే ఇంచార్జీలను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున ఇంచార్జీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ.  ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన  తర్వాత పార్టీ క్యాడర్ చేజారకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి నేతలను నియోజకవర్గంలో రంగంలోకి దింపింది.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.  ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఆగస్టు 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ  దఫా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 12 దఫాలు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు కాంగ్రెస్, ఐదు దఫాలు సీపీఐ, ఒక్కసారి టీఆర్ఎస్ విజయం సాధించింది. మంచి పట్టున్న ఈ స్థానంలో తమ జెండాను ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంది. ఈ స్థానం నుండి పాల్వాయి స్రవంతి తండ్రి  పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలు దఫాలు విజయం సాధించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణించిన తర్వాత తొలిసారగా స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కేటాయించింది. 

పాల్వాయి స్రవంతి విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ చర్చించనున్నారు టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహ పార్టీ సీనియర్లు, నియోజకవర్గానికి చెందిన మండల ఇంచార్జీలతో పార్టీ నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసింది.  నెల రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విజయం కోసం ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios