పీసీసీ పదవి రేవంత్ రెడ్డి కి దక్కుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా.. రేవంత్ రెడ్డికి బదులు.. ఇప్పుడు జీవన్ రెడ్డి పేరు రేసులోకి వచ్చింది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈరోజు జీవన్‌రెడ్డి పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్నారు. కాగా టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ రేవంత్‌రెడ్డే కాబోయే చీఫ్‌ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి అంటున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయితే ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్‌కే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే యోచనలో అధిష్టానం ఉందన్న ప్రచారం జరుగుతోంది.