హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫేస్ బుక్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి నిప్పులు చెరిగారు. ఆగష్టు 15 నుంచి అసలు పాలన చూస్తారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రజల బాధలు జోకుల్లా అనిపిస్తున్నాయా అంటూ మండిపడ్డారు. ఫేస్‌బుక్‌ వేదికగా కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణలో కొత్తగా ప్రవేశ పెట్టబోయే మున్సిపల్ చట్టం ద్వారా అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్నారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిలో ఏది అక్రమమో.. సక్రమమో చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొందని విమర్శించారు. 

అక్రమ కట్టడాలను కూలుస్తామని చెప్తున్న కేసీఆర్ ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ హెరిటేజ్ భవనం అని తెలిసినా దానిని కూలుస్తామనడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ దృష్టిలో ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనా అంటూ నిలదీశారు. 

కేసీఆర్ కి తెలంగాణ ప్రజల నుంచి వినిపించే బాధలు జోక్‌గా అనిపిస్తాయి. ప్రతిపక్షాలు చేసే నిరసనలు అంతకంటే జోక్‌గా కనిపిస్తాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కూడా జోకులా అనిపించడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణాలో ప్రజాస్వామ్యం ఏ రకంగా మంటగలుస్తోందో అర్థం అవుతుందని విమర్శించారు. 

అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని కేసీఆర్ భావిస్తున్నారని అది దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. ఇంతకాలం దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తామని చెప్పిన కేసీఆర్ ఆగస్టు 15 నుంచి అసలు పాలన మొదలవుతుందని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. 

అయితే ఇంతకాలం అసలు తెలంగాణాలో పాలన జరగలేదు అని స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు. మూడేళ్లలో అద్భుతం జరగబోతోందని కేసీఆర్ అంటున్నారని అలాగే మరోవైపు బీజేపీ కూడా రాబోయే మూడేళ్లలో అద్భుతం జరగబోతుందని చెప్తున్నారని ఎవరి మాట నిజం అవుతుందో కాలమే సమాధానం చెప్తోందని విజయశాంతి తనదైన శైలిలో విమర్శించారు.