హైదరాబాద్: 1990లోనే తనకు సీఎంగా అవకాశం వచ్చిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు స్పష్టం చేశారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో కొందరు అడ్డుకున్నారంటూ చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ నేత సీఎం అయిన రోజే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. అస్తవ్యస్థమవుతున్న వ్యవస్థలు అనే అంశంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వీహెచ్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. 

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్ష ఫలితాల అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ ను బర్తరఫ్ చేయాలని అలాగే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డితో రాజీనామా చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వీహెచ్.