హైదరాబాద్: స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు కావస్తున్నా నేటికి చెంచుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు. నల్లమలలో యురేనియం త్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. 

యురేనియం తవ్వకాలపై ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కూడా కలవాలని సూచించారు. మరోవైపు సొంత పార్టీ నేతలపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారంటూ మండిపడ్డారు. కేవలం ప్రెస్మీట్లతోనే సరిపెట్టుకుంటున్నారని పోరాటాన్ని మరచిపోయినట్లున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపట్ల పార్టీ ఇబ్బందులకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల తీరు వల్లే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ చులకనగా చూస్తున్నారంటూ మాజీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు.