రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లతో  దాడికి  బీఆర్ఎస్ శ్రేణులు  ప్రయత్నించడంపై  కాంగ్రెస్ మండిపడింది. ఈ తరహ దాడులు మానుకోవాలని కాంగ్రెస్ డిమాండ్  చేసింది. 

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై బీఆర్ఎస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తప్పుబట్టారు.బుధవారంనాడు మాజీ ఎంపీ వి.హనుమంతరావు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ పై కోడిగుడ్ల దాడిని దుర్మార్గంగా ఆయన పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ సభ పెడితే తాము కూడా ఇలానే దాడులు చేయాలా అని హనుమంతరావు ప్రశ్నించారు. మాపై రాళ్లు విసిరితే ఏపీకి వెళ్తే బీఆర్ఎస్‌కు ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆయన చెప్పారు.

 కేసీఆర్ తన ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలని హనుమంతరావు కోరారు. కేసీఆర్ మెప్పు కోసం రేవంత్ రెడ్డి పాదయాత్రపై గండ్ర వెంకటరమణరెడ్డి దాడి చేయించారని ఆయన ఆరోపించారు.

also read:నాపై గుడ్లు, టమోటాలు వేయిస్తావా.. నేను తలచుకుంటే నీ ఇల్లు, థియేటర్ వుండవు : గండ్రకు రేవంత్ వార్నింగ్

ఇదే తరహలో దాడులు చేస్తే ప్రజల నుండి బీఆర్ఎస్ నేతలు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన తప్పదని కాంగ్రెస్ నేత మల్లు రవి అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి పాదయాత్రపై దాడికి యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

నిన్న భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అనుచరుల పనిగా ఆయన పేర్కొన్నారు. తాను తలుచుకుంటే గండ్ర వెంకటరమణరెడ్డి ఇల్లు, థియేటర్ కూడా ఉండవని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

గత నెల 6వ తేదీన మేడారంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించన నాటి నుండి ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ నిన్న భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పై కోడిగుడ్లతో దాడికి దిగారు.