టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెద్దమ్మ గుడిలో కేటీఆర్ ప్రమాణం చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు.

ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయన వేచి చూశారు. అయితే ఎంతకీ కేటీఆర్ రాకపోవడంతో హనుమంతన్న మండిపడ్డారు. విద్యార్ధులకు జరిగిన అన్యాయాన్ని అమ్మవారి దృష్టికి తీసుకువెళుతూ ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టారు.

రెండేళ్ల లోపే ప్రభుత్వం కూలిపోతుందని, విద్యార్ధులకు అన్యాయం తలపెట్టినవారెవరు బాగుపడరని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు గ్లోబరీనా అనే సంస్థ గురించి తెలియదా అని హనుమంతరావు నిలదీశారు.

కేటీఆర్ పెద్దమ్మ గుడికి రాకపోవడంతో ఆ కంపెనీతో ఆయనకున్న అనుబంధం నిజమని తేలిపోయిందన్నారు. కాగా, గ్లోబరీన్ సంస్థతో తనకెలాంటి సంబంధం లేదని హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో మంగళవారం మధ్యాహ్నం లోపు ప్రమాణం చేయాలని కేటీఆర్‌కు వీహెచ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.