సికింద్రాబాద్‌: తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఇంకా ప్రచార దశలోనే ఉన్నాయి. కానీ అప్పుడే ప్రజాకూటమిలో సీఎం సీటుపై లొల్లి మెుదలైంది. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే 40 మంది సీఎంలు అంటూ టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను నిజం చేసేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంకా ఎన్నికల ప్రచారం ముగియలేదు. ఎన్నికలు జరగలేదు, ఫలితాలు విడుదల కాలేదు. బాక్స్ లో ఓటు పడలేదు కానీ సీఎం కుర్చీపై మాత్రం రగడ మెుదలవుతుంది. తాజాగా  ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని కాంగ్రెస్ సీనియర్ నేత, కంటోన్మెంట్ ప్రజాకూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత కోటాలో తనకు ఆ అవకాశం వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.   

కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కార్ఖానా, కాకగూడలో రోడ్ షో నిర్వహించిన ఆయన సీఎం కుర్చీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే సత్యనారాయణకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న  కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు, సినీనటి నగ్మా అలా చూస్తుండిపోయారు.  

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి మాట తప్పారని గుర్తుచేశారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్ఠానం దళితుడిని సీఎం చేస్తానని నిర్ణయిస్తే దళితుడైన తనకు ఆ అవకాశం రావొచ్చని అభిప్రాయపడ్డారు. 

అయితే అంతా ఆశ్చర్యంగా చూడటంతో కనీసం డిప్యూటీ సీఎం పదవి అయినా వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పోనీ అదీ లేకుంటే మంత్రినైనా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఓటర్లకు హామీ ఇచ్చారు సర్వే సత్యనారాయణ.