రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. టీపీసీసీ చీఫ్‌కు ఎక్కడికైనా వెళ్లే అధికారం వుంటుందని ఆయన గుర్తుచేశారు.
టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) నల్గొండ పర్యటనకు సంబంధించి టీ.కాంగ్రెస్‌లో వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి (jeevan reddy) స్పందించారు. పీసీసీ చీఫ్ ఎక్కడికైనా వెళ్లొచ్చని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడికి ఇందుకు అధికారం వుందని జీవన్ రెడ్డి అన్నారు. ఇదే వ్యవహారంపై టీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ (madhu yashki) మాట్లాడుతూ.. బలహీనంగా వున్న చోట మీటింగ్ పెడితే బాగుంటుందని కోమటిరెడ్డి చెప్పారని వ్యాఖ్యానించారు.
కాగా.. వరంగల్‌లో మే 6న నిర్వహించే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ (raghul gandhi) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలో సన్నాహాక సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 27న నల్గొండ జిల్లాల్లో పర్యటించాల్సి ఉండగా.. ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (uttam kumar reddy) , కోమటిరెడ్డి (komatireddy vankat reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పర్యటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వీక్‌గా ఉందని.. అక్కడ జన సమీకరణ ఏర్పాటు చేయాలని అన్నారు.
నల్గొండలో తాము పెద్ద పైల్వాన్‌గా ఉన్నామని.. ఇక్కడ రివ్యూ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సమీక్ష ఏర్పాటు చేస్తామని అన్నారు. బయటి నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. తాండూరులో మహేందర్ రెడ్డికి అవమానం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువ అని అన్నారు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నా లేనట్టేనని విమర్శించారు. పోలీసులు నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు.
దీంతో రేవంత్ పర్యటన వాయిదా పడింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి జనారెడ్డి (janareddy) జోక్యం చేసుకున్నారు. పలువురు సీనియర్ నేతలతో చర్చించి.. రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్‌లో సన్నాహక సమావేశాన్ని ఖరారయ్యేలా చేశారు. ఇందుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడా జానారెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
ఇక, గత కొన్ని రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి పర్యటనకు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఆయన వర్గం నేతలు మండిపడ్డారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తమ్, కోమటిరెడ్డిల వైఖరిపై చర్చించారు.
