తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక పార్టీలో చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లు.. హైకమాండ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారు.

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక పార్టీలో చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లు.. హైకమాండ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారు. తాజాగా సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఎవరన్నది ముఖ్యం కాదని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ సూచనలు బాధ్యతగా పాటించాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

కాగా, కొద్దిరోజుల క్రితం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని కోమటిరెడ్డి సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తాను తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితమవుతానని కోమటిరెడ్డి వెల్లడించారు.

Also Read:అది టీపీసీసీ కాదు.. టీడీపీపీసీసీ, ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీని ఇన్‌ఛార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ సామాన్య కార్యకర్తకు వస్తుందని అనుకున్నానన్నారు కోమటిరెడ్డి. తాను కార్యకర్త నుంచి వచ్చిన వాణ్ణి అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో కార్యకర్తలకు న్యాయం జరగదని కేడర్‌కి చెప్పినట్లయ్యిందని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.