సనత్ నగర్: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. అంతేకాదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని కూడా అంటారు. అది నిజమని ప్రజాకూటమి విషయంలో రుజువైంది కూడా. 

37 ఏళ్లు ఒకపార్టీపై ఒక పార్టీ నిప్పులు చెరిగాయి. పోరాటాలు చేశాయి. ఇంకా చెప్పాలంటే ఒక పార్టీని ఇంటికి పంపాలన్న ఉద్దేశంతో మరో పార్టీ పుట్టింది. ఆ పార్టీలే కాంగ్రెస్, తెలుగుదేశం. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీలు ఏకమై దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలకు నాంది పలికాయి. 

అంతేకాదు కాంగ్రెస్ అంటేనే ఒంటికాలిపై లేచే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ జెండా కప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదెలానో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓటమే ధ్యేయంగా ప్రజాకూటమి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి. ఈ నేపథ్యంలో ప్రజాకూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నాలుగు పార్టీల జెండాలను మెడలో వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

37 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోని టీడీపీ నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందే. అటు కాంగ్రెస్ పార్టీ జెండాను దరి చేరనివ్వని టీడీపీ నేతలు సైతం ప్రజాకూటమి పుణ్యమా అంటూ ఆ పార్టీ జెండా కూడా కప్పుకోవాల్సి వచ్చింది. 

 అయితే అభ్యర్థులే పార్టీ జెండాలు కప్పుకోవడం ఏంటి అధ్యక్షులు కూడా కప్పుకోవాలని అనుకున్నారో లేక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కండువాకప్పుకుంటే చూడాలనుకున్నారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత గంగా భవానీ వేదికపై చంద్రబాబు వద్దకు వెళ్లారు.  కాంగ్రెస్ కండువా వేశారు. 

కాంగ్రెస్ కండువా వేసిన అనంతరం ఆమె చంద్రబాబుతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గంగాభవాని భుజం తట్టారు. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని చూసిన రాహుల్ గాంధీ ముసిముసి నవ్వులు నవ్వారు.