నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: కొలిక్కి వస్తున్న అభ్యర్థుల జాబితా, రెండు విడతలుగా లిస్ట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ భేటీ కానుంది.వీలైతే ఒకే జాబితాలో అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారం నాడు న్యూఢిల్లీలో భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేయనుంది. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి అందుబాటులో ఉండాలని తెలంగాణ నేతలకు కాంగ్రెస్ నాయకత్వం ఆదేశించింది. దీంతో అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ నాయకత్వం కొలిక్కి తీసుకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే సుమారు 70 మందికి పైగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారని సమాచారం. మిగిలిన అసెంబ్లీ నియోజవకర్గాల్లో అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు న్యూఢీల్లీకి చేరుకున్నారు. అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇతర పార్టీల నుండి ఇంకా వలసలు సాగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వలస నేతలకు కూడ టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే వలస నేతలకు టిక్కెట్ల కేటాయింపు అంశం ఇప్పటివరు పార్టీ కోసం పనిచేసిన నేతల్లో అసంతృప్తికి గురి చేస్తుంది.
అయితే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. సర్వే రిపోర్టుల ఆధారంగా టిక్కెట్లను కేటాయించనున్నారు. పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థుల జాబితా ఖరారుపై చర్చిస్తున్నారు.
అభ్యర్థుల జాబితాను ఈ నెల 15న ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే అభ్యర్థుల జాబితా ఇంకా పూర్తి కానందున బస్సు యాత్ర తర్వాత యాత్రను పూర్తి చేయాలని అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మరో వైపు కొందరు అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయాలనే చర్చ కూడ పార్టీలో లేకపోలేదు.
ఈ నెల 15 నుండి బస్సు యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.ఈ యాత్రలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడ పాల్గొంటారు. బస్సు యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ సభకు సోనియాగాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన కాంగ్రెస్ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ సమావేశంలో బస్సు యాత్రపై చర్చించారు.
also read:కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం: బస్సు యాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన
ఇవాళ జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారు. వీలైతే ఒకే విడతలో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఒకే విడతలో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోతే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.