హైదరాబాద్: అక్టోబర్ 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు  చేస్తోంది. ఈ మేరకు  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు వీలుగా అధిష్టానంతో ఉత్తమ్ చర్చించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్  అక్టోబర్ మాసంలో విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు  అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసినందున కాంగ్రెస్ పార్టీ కూడ  అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు  కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు మహాకూటమితో పొత్తులో భాగంగా  వదిలేసిన సీట్లను మినహాయించి ఇతర సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ భావిస్తున్నాడు. అయితే మహాకూటమిలోని పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్ధుబాటు పూర్తి కాలేదు. 

కనీసం 75 నుండి 90 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.తాము బలంగా ఉన్న స్థానాలను మహాకూటమిలోని పార్టీలకు వదిలేయకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే  ఇప్పటికే డీసీసీల నుండి  అభ్యర్థుల జాబితా పీసీసీకి చేరింది. అంతేకాకుండా ఇప్పటికే  సుమారు  1046 మంది  అభ్యర్థులు టిక్కెట్ల కోసం పీసీసీకి ధరఖాస్తులు చేసుకొన్నారు.

అయితే డీసీసీల నుండి వచ్చిన జాబితా ఆధారంగా అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనున్నారు.  ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో ముగ్గురు అభ్యర్థుల జాబితాను పీసీసీ తయారు చేసింది.ఈ నివేదికతో ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం.

మరోవైపు  అక్టోబర్ 4వ తేదీన  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హైద్రాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు  అభ్యర్థుల ఎంపికకకు సంబంధించి కసరత్తు చేయనున్నారు. ఇదిలా ఉంటే  అక్టోబర్ 11 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తోంది. అక్టోబర్ 11వ తేదీన అభ్యర్థుల జాబితాను  ప్రకటించేందుకు  వీలుగానే ఉత్తమ్ మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.