హైదరాబాద్: హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి. బుధవారం ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. 

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకోసం టీఆర్ఎస్ పార్టీ భారీగా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. 

కేసీఆర్‌ కుటుంబానికి చెందిన మీడియాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటనలు అత్యధికంగా వస్తున్నాయని ఆ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే పరిగణించాలని ఈసీని కోరారు. టీఆర్ఎస్ నేతలు పెట్టే ప్రతీపైసాను అభ్యర్థి లెక్కలోనే పరిగణించాలని కోరారు.  

హుజూర్‌నగర్‌లో మంత్రుల ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. కోడ్ ఉల్లంఘించిన మంత్రులపై కేసులు నమోదు చేయాలని ఈసీని కోరారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిని గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు మర్రి శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఇకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావులతోపాటు మరికొంతమంది నేతలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఈనెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అనంతరం 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికి ఎన్నిక ఫలితాన్ని అధికారులు ప్రకటించనున్నారు. అయితే హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు. ఈ పరిణామాల నేపథ్యంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో హుజూర్ నగర్ ఉపఎన్నిక అనివార్యమైంది.