నల్గొండకు బయటి నుంచి నాయకులు రావాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ క్రమంలోనే ఆయన నేడు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

నల్గొండకు బయటి నుంచి నాయకులు రావాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ క్రమంలోనే ఆయన నేడు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్‌ మాట్లాడుతూ.. పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తాను మాట్లాడనని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ప్రజలను మోసం చేయలేరని అన్నారు. స్కామ్‌లు చేస్తున్న కేసీఆర్‌పై.. ఎందుకు ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు లేవని ప్రశ్నించారు. యూపీ, బిహార్‌కి ఎంఐఎంను పంపింది ఎవరని ప్రశ్నించారు. లౌకికవాదాన్ని నాశనం చేయడానికి 8 ఏళ్లు ఎవరు సాయం చేశారని కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అయితే మాణిక్కం ఠాగూర్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చర్చకు వచ్చినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక, రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకించడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకుని నాగార్జున సాగర్‌లో రేవంత్.. సన్నాహక సమావేశం ఏర్పాటు చేసేలా చూశారు. అయితే ఈ సమావేశానికి కోమటరెడ్డి బ్రదర్స్, వారి వర్గం మినహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా హాజరయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో తాను రేవంత్ సమావేశానికి వెళ్లలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్‌తో అంటిముట్టనట్టుగా ఉంటున్న ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి కూడా రేవంత్ సమావేశానికి హాజరు కాలేదు. 

ఇక, నల్గొండలో టీపీసీసీ చీఫ్ Revanth Reddy సమావేశం నిర్వహించవద్దని Komatireddy Venkat Reddy చేసిన వ్యాఖ్యలపై ఎఐసీసీ ఆరా తీసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు పార్టీ నాయకత్వానికి పంపారు.