లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ప్రధాని మోదీకి ఉన్న చులకన భావంతోనే ఈ సభలోకి రాలేదని విమర్శించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ప్రధాని మోదీకి ఉన్న చులకన భావంతోనే ఈ సభలోకి రాలేదని విమర్శించారు. బీజేపీ విభజించు పాలించు సిద్దాంతాన్ని పాటిస్తుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ మీద, మంత్రి మండలి మీద దేశ ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని విమర్శించారు.
‘‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ దేశంలోని ఆదివాసీల మీద గౌరవంతో మణిపూర్‌లో జరిగిన హింసపై.. వారికి సభలోకి వచ్చి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి ఉంటే ఆయనకు గౌరవం పెరిగి ఉండేంది. ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ప్రధాని మోదీకి ఉన్న చులకన భావంతోనే ఈ సభలోకి రాలేదు. ఆదివాసీలను గౌరవించలేదు. ప్రధాని మోదీ మీద, మంత్రి మండలి మీద దేశ ప్రజలకు విశ్వాసం పోయింది. మణిపూర్‌తో పాటు గిరిజన ప్రాంతాలలో మొదటి నుంచి జాతులు, మతాలు, భాషల మధ్య బ్రిటీష్ వారు విభజించు, పాలించు సిద్దాంతాన్ని తీసుకొచ్చారు.
ఆ విధానాన్ని బ్రిటీష్ జనతా పార్టీ.. అంటే బీజేపీ.. ఈరోజు మణిపూర్‌లో ఫాలో అవుతుంది. కుకీల, మైయితీల, నాగాల మధ్య వైరం పెట్టి.. అక్కడ రాష్ట్రంలో, ఇక్కడ దేశంలో అధికారాన్ని పదిలం చేసుకుంది. దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని కొనసాగించడాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇండియా టీమ్ సంపూర్ణంగా వ్యతిరేకిస్తోంది. మణిపూర్ మండిపోతుంటే, ఆడబిడ్డలు కాలిపోతుంటే, తలలు తెగిపడుతుంటే, రక్తం ఏరులైపారులుతుంటే.. ప్రధాని, హోం మంత్రి అక్కడికి వెళ్లి శాంత్రిభద్రతల రక్షించాల్సింది పోయి.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.
రాముడిని, భజరంగబలిని రాజకీయాలకు వాడుకుందామని చేసిన మత ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిసర్కించారు. కర్ణాటక ప్రజల తీర్పు దేశానికి ఒక దిక్సూచి. మణిపూర్‌లో హింస జరుగుతున్నప్పటికీ.. ఎన్నికల్లో ప్రయోజనమే ఈ ప్రభుత్వానికి ముఖ్యం. ఎన్డీఏ అంటే.. నేషన్ డివైడ్ అలియెన్స్. ప్రధాని మోదీ సభలోకి వచ్చి.. మణిపూర్ ప్రజల దుఖాన్ని తగ్గించే ప్రయత్నం చేసి ఉంటే ఆయన గౌరవం పెరిగేది. మణిపూర్ ప్రజలకు విశ్వాసం కల్పించేలా సభలోకి వచ్చి బాధ్యతను నిర్వహించేలా ప్రధానిని ఆదేశించమని స్పీకర్‌గా మిమ్మల్ని కోరుతున్నాను’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
