హైదరాబాద్‌ సంస్కృతి, పేరును మారుస్తామని కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి చేయకున్నా ప్రచారం చేసుకోవచ్చని గోబెల్స్‌ అన్నదమ్ములు మోడీ, అమిత్‌ షా నిరూపించారని ఎద్దేవా చేశారు.

చార్మినార్‌కు ఇరువైపులా వేలాది మంది ఉపాధి కోసం వచ్చి ఈ గడ్డపై స్థిరపడిపోయారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయంలో 70 శాతం ఒక్క హైదరాబాద్‌ నుంచే వస్తోందన్నారు.

ముస్లింలలో ఆర్థికంగా వెనుకబడిన వారి వృద్ధికోసం 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సచార్‌ కమిటీని నియమించి.. మైనార్టీలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని ఎంపీ గుర్తుచేశారు.

కానీ ఇక్కడి మైనారిటీలు ఎప్పటి నుంచో ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారని.. కానీ మజ్లిస్ ఎవరి ఒడిలో కూర్చున్నదో ఒక్కసారి గమనించాలని రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా టీఆర్ఎస్ అండగా నిలుస్తోందని.. ఆ మద్దతుకు ఎంఐఎం సహకరిస్తోందని ఆయన ఆరోపించారు. ఒవైసీ మాటలు విని మైనారిటీలు టీఆర్ఎస్‌కు ఓటేస్తున్నారని.. ఆ ఓట్ల మద్దతు పొంది టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడుతోందని రేవంత్  రెడ్డి వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కలిసి కాంగ్రెస్‌ను బలహీన పరచడం వల్లే బీజేపీ ఎదుగుతోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో కాషాయం ఎదగడానికి టీఆర్ఎస్సే ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

వరదల సమయంలో హైదరాబాద్ వంక చూడని బీజేపీ నేతలు.. ఎన్నికలు వచ్చే సరికి క్యూ కడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. అసదుద్దీన్‌పై అంత ప్రేమ ఉంటే ఇంటికి పిలిచి విందు ఇచ్చి షేర్వాణీ కుట్టించాలి కానీ ఓటు వేయవద్దని అని రేవంత్‌ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.