తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్, సంజయ్‌లు తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆ ఇద్దరూ కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నారని రేవంత్ విమర్శించారు. టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని.. కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకు పరస్పరం సహాయం చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మజ్లిస్‌ సంపూర్ణ సహకారం అందిస్తోందని.. దీనికి టీఆర్ఎస్ సమన్వయం చేస్తోందని రేవంత్ ఎద్దేవా చేశారు. బిహార్‌ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు.

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ జైలుకు వెళ్తే బెయిల్‌ ఇప్పించింది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావేనని రేవంత్ గుర్తుచేశారు. బీజేపీ, ఎంఐఎంది తెరముందు కుస్తీ.. తెరవెనుక దోస్తీ అని ఆయన ఆరోపించారు.

హిందుత్వ పార్టీ అని చెప్పుకొనే బీజేపీ నేతలు.. సచివాలయంలో వందేళ్ల చరిత్ర కలిగిన నల్లపోచమ్మ గుడిని కూల్చివేస్తే ఎందుకు వెళ్లలేదని రేవంత్ ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘బస్తీ హమారా-బల్దియా హమారా’ అనే నినాదంతో కాంగ్రెస్‌ పోరాడుతుందని ఆయన చెప్పారు