మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. బీసీల ఆత్మ గౌర‌వాన్ని త‌ల‌సాని.. కేటీఆర్ కాళ్ల ద‌గ్గర తాక‌ట్టు పెట్టారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

అభినవ అంబేడ్కర్, జ్యోతీరావ్ పూలే అంటూ త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్.. కేటీఆర్ భ‌జ‌న చేస్తుంటారని రేవంత్ మండిపడ్డారు. ఆయన అన్నీ త‌లకుమాసిన మాట‌లు చెబుతున్నాడ‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను జ్యోతిరావు పూలేతో పోలుస్తూ తలసాని గులాం గిరీ చేస్తున్నాడ‌‌ని వ్యాఖ్యానించారు. 

త‌లసాని త‌న మ‌నువ‌డికి కేటీఆర్ పేరు పెట్టడంపైనా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎవరైనా పేరు పెట్టుకుంటే అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ వంటి వార్ల పేరు పెట్టుకుంటారని గుర్తుచేశారు.

ప్రజలకు తన జీవితాన్ని ధార పోసిన వాళ్ళ పేరు పెట్టుకుంటారని, లేదంటే ముఖ్యమైన వారి పేర్లు, లేదా మన పెద్దల పేర్లు పెట్టుకుంటామని రేవంత్ చెప్పారు. అలా కాకుండా రోడ్ల మీద జులాయిగా తిరిగే, గెస్ట్ హౌస్‌‌లో పడుకునే మంత్రి కేటీఆర్ పేరు మనవడికి పెట్టుకుంటావా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లోని బ‌స్తీల‌లో ఉన్న వరద బాధితుల‌కు ఇంత‌వ‌రకూ స‌రైన సాయం అందలేద‌ని రేవంత్ విమర్శించారు. వారంద‌రకీ త‌క్షణసాయం అందివ్వాల‌ని డిమాండ్ చేశారు.

దీన్ దయాళ్‌ నగర్‌లో సుమేధ‌ అనే చిన్నారి నాలాలో కొట్టుకుపోతే ఇంత వరకు ఆ కుటుంబానికి నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పటికీ నాలాలపై కంచె వేయలేదని, కేటీఆర్‌పై మాటలు మాని వరద బాధితులకు సహాయం చేయాలని రేవంత్ డిమాండ్  చేశారు.