కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల 6న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు రాహుల్. అనంతరం శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ బయల్దేరతారు. తర్వాత వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు సభనుద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు.. అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాత్రికి దుర్గం చెరువు పక్కనే ఉన్న కోహినూర్ హోటల్‌లో రాహుల్‌ బస చేస్తారు. తర్వాతి రోజు (మే 7న) ఉదయం కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి కోహినూర్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు రాహుల్. అనంతరం సంజీవయ్య పార్కులో నివాళులు అర్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. తర్వాత గాంధీభవన్‌లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం డిజిటల్ మెంబర్ షిప్ ఫొటో సెషన్‌లో పాల్గొంటారు. తర్వాత తెలంగాణ అమరవీరులతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. 

కాగా.. వరంగల్‌లో రాహుల్ గాంధీ (rahul gandhi) పాల్గొనే సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేశారు కాంగ్రెస్ నేతలు. ఓరుగల్లు సభతో రాష్ట్ర రాజకీయాల్లో వైబ్రేషన్స్‌ ఖాయమని చెబుతున్నారు టీపీసీసీ నేతలు. మరోవైపు ఇప్పట్నుంచే రాహుల్‌ సభ కోసం సన్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు.. బహిరంగ సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతులు ఈ బహిరంగ సభకు తరలివస్తారనే అంచనాతో ఉన్న కాంగ్రెస్.. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడింది.

టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) తో పాటు ముఖ్య నేతలంతా ఈ పనిలోనే తలమునకలై ఉన్నారు. రాహుల్ సభ విజయవంతానికి క్షేత్ర స్థాయిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkat reddy) , ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ (madhu yashki) వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభా స్థలి పరిశీలనతో పాటు జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

కాగా.. 2023 లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (trs) ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ రేసులో ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బీజేపీ (bjp) నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఉందని నిరూపించిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంప గుత్తగా షిఫ్ట్ కానుంది.