టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని రేవంత్‌తో చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని రేవంత్‌తో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. చౌటుప్పల్‌ రాజీవ్‌ భవన్‌లో ఆదివారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ది అరాచక పాలన అని.. హిట్లర్‌ బతికి ఉంటే కేసీఆర్‌ను చూసి విలపించేవారంటూ ఎద్దేవా చేశారు. కేవలం గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకే ఆయన సీఎంలా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రం పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. సుమారు రూ. 3,400 కోట్లు మంజూరు చేయించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. 

కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అది టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని కోమటిరెడ్డి సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తాను తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితమవుతానని కోమటిరెడ్డి వెల్లడించారు.

Also Read:అది టీపీసీసీ కాదు.. టీడీపీపీసీసీ, ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీని ఇన్‌ఛార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ సామాన్య కార్యకర్తకు వస్తుందని అనుకున్నానన్నారు కోమటిరెడ్డి. తాను కార్యకర్త నుంచి వచ్చిన వాణ్ణి అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో కార్యకర్తలకు న్యాయం జరగదని కేడర్‌కి చెప్పినట్లయ్యిందని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.