న్యూఢిల్లీ: భువనగిరి నియోజకవర్గంలో నెలకొన్న రైల్వే సమస్యలపై చర్చించేందుకు కేంద్రరైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పలు స్టేషన్లలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. 
 

భువనగిరి లోక్ సభ పరిధిలోని భువనగిరి, జనగామ, ఆలేరు ప్రాంతాల రైల్వేస్టేషన్ లలో శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను ఆపాలని కోరారు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు ప్రతీరోజు 30 వేలకు పైగా జనాభా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, రోజువారి కూలీలు అనునిత్యం వస్తూ వెళ్తుంటారని స్పష్టం చేశారు. 

రైల్వే సౌకర్యాలు సరిపోక  ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో స్పష్టం చేశారు. మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

స్వామి దర్శనం కోసం రోజుకు 50వేల మంది భక్తులు వస్తుంటారని వారికి రైల్వే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి సమస్యలు విన్న కేంద్రరైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంబంధిత ఉన్నతాధికారులతో సంప్రదించి సర్వేలు చేయిస్తానని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ధన్యవాదాలు తెలిపారు.