తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఫార్మాసిటీ వ్యతిరేక సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాలపై తెరాస నేతలు పడ్డారని ఆయన మండిపడ్డారు. ఫార్మాసిటీ అంటేనే ఒక కుంభకోణమని.. అధికార పార్టీ నేతలు డబ్బులు సంపాదించుకునేందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.  

సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకు అక్రమ ధనార్జనపైనే దృష్టి పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకునే వాడినని.. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని వెంకటరెడ్డి హెచ్చరించారు.

గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయని కేటీఆర్.. ఫార్మాసిటీల పేరుతో శ్మశానవాటికలు కట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రూ.3లక్షల కోట్లు స్వాహా చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారని కోమటిరెడ్డి విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో తెరాస ఖాళీ అవుతుందని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.