బీజేపీలో చేరాలనే నిర్ణయంతో బలహీనత బయటపడింది: ఈటలపై జీవన్ రెడ్డి
బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకొని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకొని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.హైద్రాబాద్‌లో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో ఈటల చేరుతాడని తాను ఊఁహించలేదన్నారు.కమలదళంలో చేరాలని ఈటల రాజేందర్ నిర్ణయం ఆయన బలహీనతను బయటపెడుతోందన్నారు. టీఆర్ఎస్ అవినీతికి రక్షణగా బీజేపీ నిలిచిందని ఆయన విమర్శించారు.
also read:కష్టకాలంలో అండగా ఉన్నా, బ్లాక్‌మెయిల్‌తో కొనలేరు: కేసీఆర్‌పై ఈటల
బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నప్పుడు కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్ని పార్టీల నేతలను ఎందుకు కలిశాడో చెప్పాలని ఆయన ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. బీజేపీలో చేరాలనే నిర్ణయంతో ఈటల రాజేందర్ తన స్థాయిని తగ్గించుకొన్నారని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గానికే రాజేందర్ పరిమితం కానున్నారని ఆయన చెప్పారు.
గత వారంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఈ నెల 11వ తేదీ తర్వాత బీజేపీలో చేరనున్నారు. మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ పలు పార్టీల నేతలను కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, లెఫ్ పార్టీల నేతలతో చర్చించిన విషయం తెలిసిందే.