కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేయాలంటూ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవడం తెలంగాణ రాజకీయాలను మరోసారి హీట్ ఎక్కించాయి.

ఈ క్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి టీఆర్ఎస్‌లో చేర్చుకోమని కోరామని.. దీనికి ఆయన అంగీకారించారని తెలిపారు.

ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు అందించి.. సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వనమా పేర్కొన్నారు. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వనమా.. రేగా కాంతారావు తెలిపారు.

టీఆర్ఎస్‌లో తమ చేరికను ప్రజలు స్వాగతించారు కనుకే ఇటీవల జరిగిన పార్లమెంట్, పరిషత్ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తీర్పునిచ్చారని వారు స్పష్టం చేశారు.