హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెసు పార్టీకి ధమ్కీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరడానికి సిద్ధపడ్డారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు టీఆర్ఎస్ లో చేరనున్నారు. వారిద్దరు రేపే (ఆదివారంనాడే) టీఆర్ఎస్ లో చేరనున్నారు.

అవసరమైతే తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామని ఆత్రం సక్కు, రేగా కాంతారావు చెప్పారు. తాము టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారిద్దరు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయి. ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెసుకు ఝలక్ ఇచ్చారు.

రేపు (ఆదివారం) ఉదయం ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్ఎస్ లేరనున్నారు. ఈసారి కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందని, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలన్నా, కేంద్రం వద్ద పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నా, రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా కేంద్రాన్ని శాసించే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరాలని వారు ఓ సంయుక్త ప్రకటనలో అన్నారు. 

అందు కోసం కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని వారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, తమ జిల్లాల అభివృద్ధి కోసం, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఆదీవాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం కేసిఆర్ తో కలిసి పనిచేయాలని, టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నామని వారు వివరించారు.