ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేసేందుకు సీతక్క పడవలో వెళ్లారు. అయితే తిరిగి వస్తుండగా వాగు మధ్యలో పడవలో పెట్రోల్ అయిపోయింది.

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళుతున్న ఎమ్మెల్యే సీతక్క.. వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం కూడా వరద ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేసేందుకు సీతక్క పడవలో వెళ్లారు. ఏటూరు నాగారం మండలం ఎనిశెట్టిపెల్లి వాగు దాటి వరద బాధితులను పరామర్శించారు. వారికి నిత్యావసరాలు అందజేశారు.

అయితే తిరిగి వస్తుండగా వాగు మధ్యలో పడవలో పెట్రోల్ అయిపోంది. దీంతో అక్కడ తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే వాగు ఉధృతికి పడవ ఒడ్డుకు సమీపంలోని చెట్టు వద్దకు చేరింది. అనంతరం పడవలో నుంచి దిగిన సీతక్క, ఆమెతో పాటు పడవలో ఉన్నవారు ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక, పడవలో ప్రయాణిస్తున్న సీతక్కతో సహా అందరూ సురక్షితంగా బయటపడినట్టుగా అధికారులు వెల్లడించారు. 

Scroll to load tweet…

ఈ విషయాన్ని సీతక్క కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అదృష్ణవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడినట్టుగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీతక్క ట్విట్టర్‌లో షేర్ చేశారు.