తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. అయితే ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత సీతక్క.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 99 మంది సభ్యులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఓటు వేసి తర్వాత ఈ విషయంపై ఎమ్మెల్యే సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను ఓటు సరిగానే వేశానని చెప్పారు. తమ పార్టీ అనుకున్న అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు.
బ్యాలెట్ పేపర్ పైభాగంలో పొరపాటున పెన్ మార్క్ పడిందన్నారు. అభ్యర్థుల పేర్ల దగ్గర పెన్ మార్క్ పడలేదన్నారు. తాను వేయాల్సిన చోట ఓటు సరిగానే వేశానని చెప్పారు. అయితే పెన్ మార్క్ పడటంతో.. చెల్లుబాటు అవుతుందో, లేదో అనే అనుమానం ఉందన్నారు. అయితే ఇబ్బంది ఏముండదని అధికారులు చెప్పారని అన్నారు. బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు అవుతుందో.. లేదో అనే అనుమానం ఉందన్నారు. మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారని వెల్లడించారు.
ఇక, ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 21న జరగనుంది. అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ.. 132గా ఉంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓట్ల విలువ 15,708గా ఉంది.
